టీవీ9 ఓవరాక్షన్‌కు బ్రేక్

 tv9

రెండు తెలుగు న్యూస్ చానెళ్ల పోటీ రక్తికడుతోంది… ఇప్పుడు జనం టీవీ9 మూణ్నాళ్ల సంబురాలు చూసి నవ్వుకుంటున్నారు… ఆ సంబరాల్లో శుష్కత్వం చూస్తే ఒకింత జాలి కూడా కలుగుతోంది… విషయంలోకి వస్తే… తాజా బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ టీవీ9 చానెల్‌కు కిందకుపడదోసి, తను నంబర్ వన్ స్థానంలోకి వచ్చి కూర్చుంది…

అదేమిటి..? ఇంతకీ ఎవరు నంబర్ వన్..? అనేదేనా మీ ప్రశ్న… ఒకసారి ఈ ఆట జరిగిన క్రమాన్ని చూద్దాం… ఎన్నేళ్లుగానో టీవీ9 తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… (రేటింగుల దందాలో టీవీ9 పలు కేసుల్నీ ఎదుర్కున్నట్టు గుర్తు…) రవిప్రకాష్ ఆ చానెల్‌ నుంచి వెళ్లగొట్టబడ్డాక క్రమేపీ దాని రేటింగ్స్ తగ్గిపోయి, చివరకు ఎన్టీవీ ఓసారి అగ్రస్థానానికి చేరింది… టీవీ9 షాక్‌కు గురైంది…

టీవీ9 ముఖ్యుల పనితీరు టీవీ చానెళ్ల ఇంటర్నల్ సర్కిళ్లలో బాగా చర్చకు కూడా వచ్చింది… ప్రత్యేకించి రజినీకాంత్ పనితీరు… ఆ తరువాత హఠాత్తుగా టీవీ9 మళ్లీ తన పాత స్థానానికి, అంటే నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది… రెండు చానెళ్ల నడుమ తేడా అతి స్వల్పం… పైగా ఈ నంబర్ వన్ పొజిషన్ ఎన్నాళ్లుంటుందో తెలియదు… కానీ టీవీ9 ఓవరాక్షన్ చేసింది… సంబరాలు చేసుకుంది… రజినీకాంత్‌ను తిరుగులేని నాయకుడిగా కీర్తిస్తూ, కేకులు కట్ చేస్తూ, సోషల్ పోస్టులతో సంబరాలు సాగాయి… అంతేకాదు, నంబర్ వన్ స్థానాన్ని కుట్రతో సాధించలేరు అని ప్రచారం చేసింది… ఇంతకీ ఎన్టీవీ ఏ కుట్ర చేసి నంబర్ వన్ స్థానంలోకి వచ్చిందో ‘‘బాధ్యత కలిగిన బాధిత చానెల్’’గా చెప్పాలి కదా… అది చేతకాదు…


టీవీ9 సంబరాలు ఏరీతిన సాగాయో చెప్పడానికి పైన ఫోటో ఓ ఉదాహరణ… ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్ బోర్డులు… పెద్ద పెద్ద హోర్డింగులు కూడా పెట్టారట కొన్నిచోట్ల… ఈ రెండు చానెళ్ల అసలు రూపాలు తెలిసినవాళ్లు అబ్బురపడ్డారు టీవీ9 అతి ప్రదర్శనలు చూసి… రవిప్రకాష్ కొత్త చానెల్‌ ఆర్టీవీకి సంబంధించిన సైట్, స్టాఫ్ ఈ ఓవరాక్షన్‌ను వెక్కిరిస్తూ సోషల్ ట్రోలింగ్‌కు కూడా దిగింది… ఆ ట్రోలింగ్ టార్గెట్ కూడా రజినీకాంత్…

ఇప్పుడేమైంది…? మూణ్నాళ్ల మురిపెంలో ఉన్న టీవీ9ను తొక్కిపారేసి, ఎన్టీవీ మళ్లీ ఫస్ట్ ప్లేసులోకి వచ్చింది… కాస్త మెరుగైన తేడాతో… గత వారంతో పోలిస్తే ఎన్టీవీ 5 పాయింట్లు పెరిగిపోగా… టీవీ9 నాలుగు పాయింట్లు డౌనయిపోయింది… అంటే… టీవీ9 అతి సంబురాలు వికటించాయి, బెడిసికొట్టాయి… ఉల్టా టీవీ9నే వెక్కిరించాయి… మరి రజినీకాంత్ గొప్పదనం హఠాత్తుగా ఏమైపోయినట్టు..? ఇవిగో తాజా బార్క్ రేటింగుల పొజిషన్…

tv9

14వ స్థానంలో జీరో రేటింగ్స్‌తో జాబితాలో పేరు కనిపిస్తున్న మహాన్యూస్, నాలుగో ప్లేసు కోసం ఎగబాకుతున్న ఏబీఎన్ చానెళ్ల తాజా ఇరకాటం గురించి మరో కథనంలో చెప్పుకుందాం… అన్నట్టు జాగ్రత్తగా గమనించండి… ఈ రెండు ప్రధాన చానెళ్లకూ మూడో ప్లేసులో ఉన్న టీవీ5కూ నడుమ బోలెడంత తేడా… అంటే బలంగా పోటీపడుతున్న టీవీ9, ఎన్టీవీలు తెలుగు న్యూస్ చానెళ్లలో టాప్… మిగతావి అల్లంత దూరంలో ఉండిపోయాయి… మరీ పదిలోపున్నవి ఈటీవీ ఆంధ్రప్రదేశ్, టెన్ టీవీ, ఈటీవీ తెలంగాణ, హెచ్ఎంటీవీ, ఐన్యూస్… రాజ్‌న్యూస్, మహాన్యూస్ అసలు లేనట్టే లెక్క…

టీవీ9(muchata.com సౌజన్యంతో)

Post a Comment

1 Comments

  1. ఈనాడు ఉవాచ - రామోజీ ఫిలిం సిటీ కి మెట్రో పొడిగించాలని అందరూ కోరుతున్నారట. పర్యాటక అభివృద్ధి కోసమట.

    ReplyDelete