వరు తీసిన గొయ్యిలో వారే పడతారన్నట్టు తయారవుతోంది బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ కేసీఆర్ అండ్ కో పలుకుతున్న ప్రగల్భాలు వికటించడమే కాదు, చివరికి వారి పార్టీనే నామారూపాలు లేకుండా చేసేలా కనిపిస్తున్నాయి. పదే పదే ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలు..వారినే ఎదురుతన్నేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చడం కాదు, బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తోంది కాంగ్రెస్.

బీఆర్ఎస్ నేతల సంగతి పక్కనబెడితే, తెలంగాణ రాజకీయాలతో ప్రస్తుతం ఏ సంబంధం లేని వైసీపీ లీడర్లు సైతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అంటూ అనవసర వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ఎవరేం మాట్లాడినా పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ కు.. ఇక రంగంలోకి దిగకతప్పడం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు ఆ పార్టీ వ్యూహాలను రచిస్తోంది.కేసీఆర్ తన ఎమ్మెల్యేలని పక్కలో పెట్టుకున్నా సరే.. 20 మందిని లేపుకొని వస్తామంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో చెప్పకనే చెప్తోంది. ఇప్పటికే ఐదారుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, రాజకీయంగా పెద్ద దుమారమే రేపారు. అటు రేవంత్ రెడ్డి కూడా తాను గనుక తలుచుకుంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనను కలిసేందుకు క్యూ కట్టేస్తారన్న సంకేతాలను పంపించారు. అయినప్పటికీ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ ను కవ్విస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది కాంగ్రెస్ కు. ఫలితం.. అతి త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. గౌరవప్రదమైన స్థానాలనే ఆ పార్టీకి కట్టబెట్టారు. అలాంటప్పుడు ప్రజలు తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వర్తించాలి. మరోసారి వారి మనసులని గెలుచుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలి. అలా కాకుండా అధికారం లేకుంటే తాము బతకలేమన్నట్టు, తాము మాత్రమే ప్రజలకు న్యాయం చేస్తామన్నట్టు, అందుకోసం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని గులాబీ లీడర్లు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. పైగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తే, ఒక పాలకుడికి ఎంత కోపం వస్తుందో, అలాంటి సమయంలో అధికారం చేతిలో ఉన్నవారు ఏం చేయగలరో కూడా కేసీఆర్ కు తెలియనిది కాదు. అయినా తన పార్టీ నేతలతో అలాంటి వ్యాఖ్యలు చేయించడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు.ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకున్నా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించే అవకాశాలు ఉండేలా లేవు.సో టాస్క్ మరింత సులువు అయ్యేలా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే అంటారు పెద్దలు చెరపకురా చెడేవు అని..