నాడు మీడియాను బొందపెడ్తానన్నాడు.. నేడు అదే మీడియాను అడుక్కుంటున్నాడు..!

కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా సంస్థలను బహిష్కరించడమేగాకుండా, అందులో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను అందించకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.ప్రశ్నించినవారిని, ఎదురుతిరిగిన జర్నలిస్టులపై కేసులు బనాయించి జైళ్లో కూడా పెట్టాడు. తెలుగునాట టాప్ ఛానెళ్లుగా పిలవబడే కొన్ని మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ఇక తనకు ఎదురేలేదని, ఉండబోదని, ఆయా ఛానెళ్లు చెప్పిందే ప్రజలు నమ్ముతారని భావించాడు. కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చి పదేళ్లు వాటిని మేపాడు.డబ్బులు దండిగా వస్తుండటంతో ఆయా ఛానెళ్లు, ప్రతికలు కూడా కేసీఆర్ ను ఆకాశానికెత్తుతూ వచ్చాయి. ఆయన అధికారంలో ఉన్నానాళ్లు బీఆర్ఎస్ కు తెగ భజన చేశాయి. 

కట్ చేస్తే.. కేసీఆర్ అధికారం పోవడంతో.. మీడియా కూడా మొహం చాటేసింది. మొన్నటిదాకా తన భజన చేసిన సంస్థలన్నీ బీఆర్ఎస్ ను ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు.మీరు డబ్బులిచ్చారు.. మేం భజనం చేశాం.. చెల్లుకు చెల్లు అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. ఇక చిన్న సంస్థలను కేసీఆర్ ఏనాడు పట్టించుకోకపోవడంతో అవి అసలు కవరేజీనే సరిగా ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు, పోరాటానికి మీడియాలో స్పేస్ లేకుండాపోతోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల మొహం మాడిపోతోంది. అసలు తమను మీడియా పట్టించుకోవడం లేదని అందరికందరూ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు తమను ప్రశ్నించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఎక్కడికిపోయాయని ఆక్రోశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని తప్పులు మీడియాకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న సంఘటనలని బూతద్దంలో చూపిస్తూ.. మీడియా ఎక్కడికి పోయింది.. దీన్ని టీవీల్లో చూపించరా.. అని నిలదీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న రెండు, మూడు యూట్యూబ్ ఛానెళ్లు, ప్రతికలు మినహా.. ప్రస్తుతం మీడియా మాత్రం సంయమనమే పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అవుతుండటంతో విమర్శలకు దిగడం లేదు. కానీ బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం ఈ పరిణామం డైజెస్ట్ కావడం లేదు. తమ వార్తల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ తమను మీడియా కూడా మోసం చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయిందని తిట్టిపోస్తున్నారు. ఇదంతా చూస్తున్నవారు గతంలో కేసీఆర్ మీడియా పట్ల వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. చూడాలి మరి రాను రాను మీడియా వ్యవహారం ఎలా ఉంటుందో...

Post a Comment

1 Comments