మళ్లీ తెరపైకి ఉమ్మడి రాజధాని.. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం!

 


తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం రాజుకునేలా కనిపిస్తోంది. ఆంధ్రా, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని మరికొంతకాలం కొనసాగించాలంటూ వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఏపీలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎన్నికల తర్వాత దీనిపై తమ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైవీ చెప్పడం విచిత్రంగా మారింది. అతి త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ మొన్నటిదాకా చెప్పిన వైసీపీ ..ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ రాజధాని అంటూ కొత్త చర్చకు తెరలేపడం సంచలనంగా మారింది.

గతంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని వినియోగించుకునే అవకాశం ఉన్న చంద్రబాబు ఆ పని చేయలేదు. ఓటుకి నోటు కేసు పర్యవసనాల్లో పూర్తిగా హైదరాబాద్ నుంచి తరలివచ్చి విజయవాడ కేంద్రంగా పాలన కొనసాగించారు. అమరావతి శాశ్వత రాజధాని, తాత్కాలిక రాజధాని అంటూ జనాలను కన్ఫ్యూజ్ చేసారు. రాజధాని నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఆపై వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రయోగం చేసింది‌. కానీ న్యాయపరమైన అడ్డంకులతో ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయింది. అదుగో ఇదుగో విశాఖ వచ్చేస్తున్నా అంటూ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రకటించారే కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇప్పట్లో విశాఖకు రాజధాని తరలించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రస్తావన మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

వైసీపీ మాటెలా ఉన్నా.. ఆ డిమాండ్ ను ఇప్పుడు కేంద్రం పట్టించుకుంటుందా..? అసలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా..? అసలే జగన్ రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు పెద్దగా లేవు. వైసీపీ ఈ కొత్త ప్రతిపాదనను ఎందుకు తెరపైకి తెచ్చిందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Post a Comment

3 Comments

  1. మంచో చెడో. అమరావతి లో రాజధాని నిర్ణయం అందరూ ఒప్పుకున్న తరువాతే జరిగింది. ఇప్పుడు ఉన్న చోటే కట్టిన భవనాలతో కొనసాగించడం ఉత్తమం. విచిత్రమైన ఆకాశ హర్మ్యాలు, ఆర్భాటం అవసరం లేదు. ఎక్కువగా సేకరించిన భూముల లో కొంత భాగం ఇతర భవనాలకు కేటాయించి అధిక భూములలో ఉద్యాన వనాలు చెరువులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. అలాగే క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రీడా ప్రాంగణాలు, మైదానాలు కు అమరావతి లో భూమి కేటాయిస్తే బాగుంటుంది. ప్రస్తుతం యే నగరం లోనూ క్రీడా ప్రాంగణాలు, ఉద్యాన వనాలు లేవు.

      Delete
    2. సరిగ్గా చెప్పారు

      Delete