తెలంగాణ ప్రభుత్వం ఇంకా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉందా? అధికారంలో లేకపోయినా.. ప్రభుత్వ అధికారులను ఇప్పటికీ కేసీఆరే కంట్రోల్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విద్యుత్ శాఖలోని కొందరు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో అకారణంగా కరెంట్ కోతలు విధిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించడం చూస్తోంటే అధికార యంత్రాంగం ఇంకా పూర్తిగా ఆయన దారికి రానట్టే కనిపిస్తోంది. పాలనాపరంగా ఆయనను ఎవరో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్టుంది.

విద్యుత్ విషయంలోనే కాదు ఇటీవల కేఆర్ఎంబీకి కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులు అప్పగించే విషయంలోనూ కొందరు అధికారులు  రేవంత్ రెడ్డి అభిప్రాయంతో సంబంధం లేకుండా సర్కార్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ రెండు పరిణామాలు చూసిన వారంతా రేవంత్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కు సంబంధించిన కోవర్టులు ఉన్నారని వారు ఇప్పటికీ కేసీఆర్ కోసమే పని చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో కొందరు గత ప్రభుత్వంలో ఏదో రకంగా లబ్ది పొందిన వారు కాగా మరికొందరు బీఆర్ఎస్ ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రయోజనం పొందుతామని ఆశపడిన వారు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వారికి ఇప్పటికీ మింగుడు పడటం లేదని, అందుకే ప్రభుత్వంలోని కీలక విషయాలన్నింటినీ కేసీఆర్కు చేరవేరుస్తున్నారని, అలాగే ఆయన చెప్పిన సలహాల మేరకు పనిచేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే రేవంత్ కు అర్థమైనప్పటికీ.. కేసిఆర్ సానుభూతిపరులు ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నారు.. ఎవరెవరో తెలియకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి వారి చర్యలని సహిస్తున్నప్పటికీ, వారెవరో తెలిస్తే మాత్రం కఠిన చర్యలే తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. చూడాలి మరి రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న ఆ బ్లాక్ షిప్స్ ఎవరో.. ఎప్పుడు బయటపడతారో..