బీఆర్ఎస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విస్త‌రించేందుకు త‌న‌కంటూ ఓ మీడియా సంస్థ అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రికలా.. ఏపీలో న‌మ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే పేపర్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్ప‌టికే అనుమ‌తులు కూడా పొందిన‌ట్టు తెలుస్తోంది. ఎడిటోరియ‌ల్ సిబ్బంది, ఫీల్డ్‌లో ప‌నిచేసే రిపోర్ట‌ర్స్ నెట్‌వ‌ర్క్, ఇత‌ర విభాగాల విష‌య‌మై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు ప్ర‌ధాన కార‌కుడిగా కేసీఆర్ ఆ ప్రాంత స‌మాజం గుర్తిస్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మయంలో ఏపీ స‌మాజంపై కేసీఆర్ ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయంగా ఏపీలో అడుగు పెట్ట‌డానికి నాటి కేసీఆర్ దురుసు వ్యాఖ్య‌లు అడ్డంకిగా మారాయి. దీంతో త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకోడానికి సొంతంగా ఏపీలో ఓ మీడియా వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం వుంద‌ని బీఆర్ఎస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంది.  ఇప‌టికే అనుమ‌తులు కూడా పొందిన‌ట్టు స‌మాచారం. ఎడిటోరియ‌ల్ సిబ్బంది, ఫీల్డ్‌లో ప‌నిచేసే రిపోర్ట‌ర్స్ నెట్‌వ‌ర్క్, ఇత‌ర విభాగాల విష‌య‌మై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పత్రికా రంగం సంక్షోభంలో ఉన్నఈ సమయంలో కేసీఆర్.. పేపర్ ను లాంచ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈ కాలంలో డబ్బులు పెట్టి పెద్దగా ఎవరూ పత్రికలని కొనడం లేదు. ముఖ్యంగా నవ తరం అసలు పత్రికలను పట్టుకోవడం లేదు. పాత తరం.. పేపర్లకు అలవాటు పడిన కొంత మంది మాత్రమే పత్రికలు కొంటున్నారు. వారు వారు అలవాటు పడిన పత్రికలకు కాకుండా ఇతర పత్రికలు కొనే పరిస్థితి ఉండదు. ఇవన్నీ పక్కనబెడితే.. నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక పోలవరం ఎత్తుపై, పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై, రాయలసీమ లిఫ్టుపై, కరెంటు బకాయిలపై, కృష్ణాజలాల వాడకంపై ఏమంటుందో..? అప్పుడు తెలంగాణపై దుమ్మెత్తిపోస్తుందా.. లేదా కేసీఆర్ నే కీర్తిస్తుందా చూడాలి..