కొమ్మినేని శ్రీనివాసరావు...! ఉద‌యాన్నే రిమోట్ ప‌ట్టుకొని న్యూస్ ఛానెళ్లు మార్చి మార్చి చూసేవారంద‌రికీ సుప‌రిత‌చిత‌మైన పేరు. సుదీర్ఘ‌కాలం NTVలో  LIVE SHOW WITH  KSR  పేరుతో మార్నింగ్ డిష్క‌ష‌న్‌లు చేశారాయ‌న‌. కానీ 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక వైసీపీకి ఫేవ‌ర్‌గా, టీడీపీకి వ్య‌తిరేకంగా కొమ్మినేని త‌న డిస్క‌ష‌న్ల‌ను కొన‌సాగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో NTV నుంచి ఆయ‌న‌కు పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టారు. దీంతో ఆయ‌న అదే కోపంలో నేరుగా ‌ సాక్షి గూటికి చేరి KSR LIVE SHOW పేరుతో టీడీపీని  మ‌రింత చీల్చి చెండాడుతున్నారు. అంత‌ బాగానే ఉన్నా.. కొమ్మినేనిని ఇటీవ‌ల ఓ అసంతృప్తి తీవ్రంగా వెంటాడుతోందట‌. 

డిస్క‌ష‌న్ల‌లో టీడీపీని ఏకిపారేస్తూ,  వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు త‌న‌వంతుగా ఎంతో ప్ర‌య‌త్నం చేశాన‌ని.. కానీ జ‌గ‌న్ త‌న కృషిని గుర్తించలేద‌ని కొమ్మినేని బాధ‌ప‌డుతున్నార‌ట‌. అదే స‌మ‌యంలో టీడీపీని ఏనాడు ప‌ల్లెత్తు మాట కూడా అన‌క‌పోయినా...సాక్షిలోనే ప‌నిచేసే మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌కు మాత్రం జాతీయ మీడియా సలహాదారు పదవితో పాటు  జెన్‌కో సలహాదారుగా జోడు ప‌ద‌వులు ఇవ్వ‌డంపై కొమ్మినేని అసంతృప్తిగా ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు, అభిమానులు సోష‌ల్ మీడియాలో త‌మ ఆవేద‌నను వెళ్ల‌గ‌క్కుతున్నారు.  జాతీయ మీడియాలో వైసీపీ త‌ర‌పున గ‌ట్టిగా వాదించ‌డంలో అమ‌ర్‌  విఫ‌ల‌మ‌వుతున్నార‌ని.. అయినా ఆయ‌న్ను అంద‌ల‌మెక్కించార‌ని నొచ్చుకుంటున్నారు. 

ఇక  సాక్షి ఛానెల్‌లోనూ యాజ‌మాన్యం  కొత్త‌గా ఎవ‌రినో తీసుకొస్తే.. వారు కొమ్మినేనిపైనే ఆజ‌మాయిషీ చెలాయిస్తున్నార‌ని ఆయ‌న ఫాలోవ‌ర్స్ చాలా  ఫీల్ అవుతున్నారు. ఇప్ప‌టికైనా ఛానెల్ త‌ర‌పున‌ కొమ్మినేని పార్టీ కోసం ప‌డుతున్న క‌ష్టాన్ని గుర్తించ‌క‌పోతే,  ఆయ‌న్ను చేజేతులా దూరం చేసుకున్నావాళ్లు అవుతారంటూ... అది పార్టీకి తీవ్ర‌న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌ని వారు వాపోతున్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ప‌ట్టించుకోవాల‌ని కోరుతున్నారు.  ఇందులో నిజ‌నిజాలేమిటో తెలియ‌దు కానీ.. సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన  ఓ పోస్ట్ మాత్రం ఇప్పుడు తెగ వైర‌ల్‌గా మారింది.