టీవీ 9 చేతులు మారినా.. దాని పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది రవిప్రకాశ్. మీడియా వర్గాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ రవి ప్రకాశ్ అంటే తెలియనివారుండరేమో. తెలుగులో న్యూస్ ఛానెళ్లకు దశా, దిశనూ చూపింది ఆయనే అంటే అతిశయోక్తి కాదు. ఒక్క తెలుగే కాదు.. రవి ప్రకాశ్ ఏ భాషలో ఛానెల్ స్టార్ట్ చేసినా దాని రేటింగ్.. రేసు గుర్రంలా పరుగులు తీసింది. అంతటి స్ట్రాటజిస్ట్ అయిన రవి ప్రకాశ్ అదే టీవీ 9 నిర్వహణ నుంచి అనూహ్యంగా బయటకు రావాల్సి వచ్చింది. టీవీ 9 వాటాల వివాదానికి సంబంధించిన వార్తల్లో అప్పుడప్పుడు రవి ప్రకాశ్ పేరు వినిపిస్తున్నా.. ఆయన మాత్రం ఇటీవల ఎక్కడా కనిపించింది లేదు. దీంతో ఆయన ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారనే ప్రశ్న మీడియా సర్కిళ్లలో తరచూ వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో రవి ప్రకాశ్ గురించి తాజాగా మీడియా వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అది.."రవి ప్రకాశ్ రాజ్‌న్యూస్‌లోకి వెళ్తున్నారట కదా" అని. ఈ ప్రచారంలో నిజమెంత అని తెలుసుకునేందుకు TELUGU MEDIA POINT ప్రయత్నించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. "రవి ప్రకాశ్ రాజ్‌న్యూస్‌కి వెళ్లడం లేదు. ఆ ఛానెల్ నిర్వహణతో కూడా ఏ రకమైన సంబంధాన్ని కొనసాగించబోవడం లేదు"
రాజ్‌న్యూస్‌ని ఇటీవలే కొత్త యాజమాన్యం (బీజేపీ అంటున్నారు) లీజుకి తీసుకుంది. అయితే ఛానెల్ నిర్వహణ వారికి కొత్త కావడంతో ఎలా నడిపించాలి.. ఏం చేయాలనే విషయాలపై.. ఒకవేళ రవి ప్రకాశ్ దగ్గర సలహాలు, సూచనలు తీసుకొని ఉండొచ్చే తప్ప.. ఆయనే రాజ్‌న్యూస్‌లోకి వెళ్తారన్న ప్రచారంలో ఇప్పటికైతే ఎలాంటి నిజం లేదు. గతంలోనూ రవి ప్రకాశ్ ఐ న్యూస్ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ రవి ప్రకాశ్ ఛానెల్ పెట్టాల్సి వస్తే.. సొంత వనరులతో ముందుకు వెళ్తారే తప్ప.. పాతవాటి జోలికి వెళ్లే అవకాశం ఏమాత్రం ఉండదన్నది ఆయన సన్నిహిత వర్గాల అభిప్రాయం.
1 Comments
Yes ravi prakash is news channels moghal
ReplyDelete